అనంతపురం నగరపాలక ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలింది. ఓట్ల లెక్కింపునకు 2 రోజులు గడువు ఉన్నందున అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నా.. నాయకులు, అభ్యర్థులు, ప్రజల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు సర్వప్రయత్నాలు చేశారు. అభ్యర్థులకు అభయమిచ్చిన ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారో అర్థం కావడం లేదు. అయితే అభ్యర్థులు మాత్రం విజయం తమదే అంటూ ఎవరికివారు లెక్కలు వేసుకొంటున్నారు. 25వ డివిజన్‌లో ఓ ఉద్యోగి ఓటును ఇతరులు వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటరును బయటకు తీసుకెళ్లి అక్కడినుంచి ఇంటికి పంపించేశారు. 22వ డివిజన్‌లో ఓటరు జాబితాలో ఓటర్ల చిత్రాలే కనిపించలేదు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా కొన్ని డివిజన్లలో ఓటు చేసినట్లు సమాచారం.
తిరుగుబాటు అభ్యర్థుల ప్రభావం ఎక్కువే
నగరంలో ఇరు ప్రధాన పార్టీలకు రెబల్ అభ్యర్థుల గుబులు పట్టుకొంది. వైకాపా తరఫున బీఫారం దక్కని 10 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. తెదేపా తరఫున కూడా 5 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేశారు. 1వ డివిజన్‌లో మున్నీ, హనుమంతు ఇద్దరూ వైకాపాకు రెబల్ అభ్యర్థులే. ఆ డివిజన్‌లో ముస్లిం/దూదేకుల సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. దీంతోపాటు 2వ డివిజన్‌లో జాహిదాబేగం, 10వ డివిజన్‌లో రమాదేవి, పార్వతి, 20వ డివిజన్‌లో నాగమణి, నాగమల్లేశ్వరి, 22లో బాబాజీ, 40వ డివిజన్‌లో శ్రీలక్ష్మి, 43లో దుర్గేష్ వైకాపాకి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి 20వ డివిజన్‌లో భారతి, 23లో రూప ఉమ, 30లో శిరోమణి, 44లో శాంతిసుధ, 47వ డివిజన్‌లో వడ్డే మహేశ్వరి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వారికి దక్కే ఓట్లు ఆయా పార్టీలపై ప్రభావం చూపుతాయి.