అనంతపురం జిల్లాలోని మండలాలకు కొత్త సారథులు వచ్చేశారు.. మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షులు కొలువుదీరారు. ఈ పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వచ్చే ఐదేళ్లకోసం ఆయా మండలాల ఎంపీపీలను ఎన్నుకున్నారు. అన్నింటా వైకాపాకు చెందిన అభ్యర్థులే ఎంపీపీలు, వైస్ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 63 మండల పరిషత్తులకు ఎన్నికలు జరగగా.. అన్నింటిలో మెజార్టీ స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. పలు కారణాలతో అగళి, అమరాపురం మండలాల్లో ఎన్నిక వాయిదా పడగా.. మిగిలిన 61 స్థానాల్లో ప్రక్రియ పూర్తి చేశారు. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 10 గంటలకే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రకటించారు. ఇవి కూడా ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలలోపు పరిషత్తు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. తలుపుల మండలం ఎంపీపీ ఎన్నికలో హైడ్రామా నెలకొంది. అధికార పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం చెలరేగింది. ఓ వర్గం నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను ముగించినట్లు విమర్శలు వచ్చాయి. పలుచోట్ల అసమ్మతులను స్థానిక ఎమ్మెల్యేలు బుజ్జగించారు. కొన్నిచోట్ల చెరి రెండున్నరేళ్ల ప్రతిపాదనతో ఎన్నిక పూర్తిచేశారు.
అగళిలో హైడ్రామా
మండలానికి చెందిన క్షేత్ర సహాయకుడు నాసిర్ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈయన కో-ఆప్షన్ సభ్యుడి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించడంతో ఎన్నిక ప్రక్రియ మొత్తం వాయిదా పడింది. నిబంధనల ప్రకారం 20 రోజుల ముందే రాజీనామా ఇవ్వాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఇవ్వడంతో సమస్య ఎదురైంది. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తిని కాదని వేరే వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకోవాలని మెజార్టీ ఎంపీటీసీలు మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎన్నిక వాయిదా వేయించాలనే ఉద్దేశంతోనే ఈ తంతు సాగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపీటీసీ సభ్యురాలి రాజీనామా!
ఆత్మకూరు-1 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచిన లీలావతి రాజీనామా చేస్తూ ఎన్నికల అధికారికి లేఖను అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎంపీపీ పదవి కావాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరగా హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పారని ఆమె ఆరోపించారు. ఆత్మకూరు-2 నుంచి గెలుపొందిన హేమలతకు ఎంపీపీ, పి.యాలేరు ఎంపీటీసీ నీలిమకు వైస్ ఎంపీపీ పదవులు ఇచ్చారు. పార్టీ నిర్ణయంతో లీలావతి అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్నికల అధికారికి లేఖ అందజేశారు.
కోరం లేకపోవడంతో..
అమరాపురం, అగళి మండలాల్లో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. అమరాపురంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి మద్దతుదారు హేమావతి-3 ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఈరన్నకు పార్టీ బీఫారమ్ ఇచ్చారు. అయితే స్థానిక నాయకులు ఎమ్మెల్యే మద్దతుదారుకు వ్యతిరేకంగా అమరాపురం-1 శాంతమణిని ఎంపీపీగా నియమించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తమ్మడేపల్లి-2 నుంచి గెలుపొందిన లలితమ్మను కూడా ఎంపీపీగా చేయాలని మరో వర్గం ప్రయత్నాలు చేసింది. దీంతో ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన ఎంపీటీసీ సభ్యులు సాయంత్రం వరకు రాలేదు. దీంతో ఎన్నికల అధికారి అమర్ కోరం లేనికారణంగా ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైకాపా నాయకులు సభ్యులందరినీ మడకశిరకు తరలించి ఎంపీపీ పదవిని చెరిసగం విభజించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.