ఆస్తులు పంచుకున్న కుమారులు వృద్ధాప్యంలో ఆదుకొనేందుకు మాత్రం ముందుకు రావడం లేదంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని సొరకాయల పేటకు చెందిన సుంకమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలాన్ని 3 ఎకరాల చొప్పున పంచుకున్నారు. అయితే... తల్లిని మాత్రం భారంగా భావించిన వారు.. ఆమెను ఆదరించడం లేదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్య పింఛనే ఆ వృద్ధురాలికి దిక్కైంది. నడవలేని స్థితిలో ఉన్నా... మతిస్థిమితం లేని కుమార్తెను సైతం తానే పోషిస్తూ అష్టకష్టాలు పడుతోంది. కుమారులు కాస్తైనా ఆసరాగా నిలిచేలా నచ్చజెప్పాలంటూ ఆమె పోలీసులను కోరింది. ఓబులాపురానికి చెందిన లక్ష్మి అనే మరో వృద్ధురాలి పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. తిండి కూడా పెట్టకుండా సంతానం బాధపెడుతున్నారంటూ పోలీసులకు గోడు వెళ్లబోసుకొంది.
'కన్నబిడ్డలు పట్టించుకోవటం లేదు... న్యాయం చేయండి సారూ'
కనీసం నడవలేని వయసు ఆ వృద్ధురాలిది. అయినా సరే పోలీసు స్టేషన్ మెట్లెక్కక తప్పలేదు. ఎకరాలకు ఎకరాలు భూములు పంచుకున్న ఆమె కుమారులకు, తల్లికి పట్టెడన్నం పెట్టడం మాత్రం బరువుగా తోచింది. కాస్త మీరైనా నచ్చ జెప్పండంటూ పోలీసులను ఆ వృద్ధురాలు వేడుకొంది.
సుంకమ్మ అనే వృద్ధురాలి దయనీయ స్థితి
వృద్ధుల కష్టాలను అడిగి తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు వారి కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. జాగ్రత్తగా చూసుకొనేలా ఒప్పించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కనీసం నడవలేని వయసులో పట్టెడన్నం కోసం వృద్ధులు పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి పలువురిని ఆవేదనకు గురి చేసింది.
ఇదీ చదవండి:అంతర్వేది రథం దగ్ధం ఘటన: ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి
Last Updated : Sep 8, 2020, 11:06 AM IST