ఇప్పుడిప్పుడే వేసవితాపం మొదలవుతోంది. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. తాగునీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాల్లో ఎన్నో చేపడుతోంది. ప్రయోజనం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటుంది. ఎక్కడైనా కుళాయి నుంచో, తాగునీటి ట్యాంకు నుంచో నీరు వృథా అవుతుంటే కొంతమంది చూసీచూడనట్లుగా వెళుతుంటారు.
కానీ.. ఓ వానరం మాత్రం మనుషులకంటే జంతువులే నయమనేలా చేసింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ తాగునీటి ట్యాంకు నుంచి నీరు వృథాగా పోతుండటాన్ని ఓ వానరం గమనించింది. ట్యాంకు వద్దకు చేరుకున్న వానరం కాసిన్ని నీళ్లు తాగి కుళాయిని కట్టేసింది. అక్కడున్న కొంతమంది యువకులు ఈ దృశ్యాన్ని తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మనుషుల కంటే జంతువులే ఎంతో మేలు అనే సందేశాన్ని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఇప్పటికైనా నీటి వృథాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేస్తోంది.