నేడు నూతన పాలకవర్గాలు కొలువుతీరనున్నాయి. అనంత నగరపాలక, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్, ఉప మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిల్ హాళ్లను నూతన హంగులతో తీర్చిదిద్దారు.
మైనార్టీ వర్గానికి మేయర్ పదవి, ఉపమేయర్ పదవి బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైకాపా తరఫున 38వ డివిజన్ నుంచి గెలుపొందిన మహమ్మద్‌వసీంకు మేయర్ పదవి దాదాపు ఖరారైనట్టే. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే ఇద్దరు ఉపమేయర్లను ఎన్నుకోనున్నారు. అందులో ఒకటి మహాలక్ష్మి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కానీ ఇన్‌ఛార్జి మంత్రి పదవుల గురించి ప్రకటించిన వెంటనే మహాలక్ష్మి శ్రీనివాస్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఉపమేయర్ పదవిపై ఆయన అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. మరో ఉప మేయర్ ఎవరన్నది తేలాల్సి ఉంది.
ఇదీ ప్రక్రియ..
నగరపాలక సంస్థకు సంబంధించి కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎన్నికైన కార్పొరేటర్ల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మున్సిపాలిటీల్లో ఆయా కమిషనర్లు ప్రిసైడింగ్ అధికారులుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మేయర్, ఉప మేయర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉంటుంది. దీనికి ఆయా పార్టీలు జారీ చేసే విప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. తాడిపత్రి మినహా అన్ని చోట్లా వైకాపా అభ్యర్థులే పూర్తి మెజారిటీ సాధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన వారే మేయర్, ఛైర్మన్లుగా ఎన్నికవుతారు. సదరు అభ్యర్థిని బలపరుస్తూ మరొకరు ప్రిసైడింగ్ అధికారికి డిక్లరేషన్ అందజేయాలి. ఎన్నికకు సరిపడా కోరం ఉందోలేదో పరిశీలించి ప్రక్రియ మొదలుపెడతారు. హాజరైన సభ్యుల్లో సగానికి పైగా చేతులు పైకెత్తితే చాలు అభ్యర్థిని మేయర్ లేదా ఛైర్మన్‌గా ప్రకటిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పాల్గొంటారు.
ఎవరిని వరించేనో..