వాస్తు కోసం పూడ్చేసిన బావిని.. తిరిగి తవ్వుతున్న అంశంలో.. వైకాపా కార్యకర్తలు కొడవళ్లు, రాళ్లతో బాధిత కుటుంబాలపై దాడికి యత్నించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వైకాపా ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఇంటికి సమీపంలో ఈశాన్య భాగంలో బావి ఉండేది. ఆ బావి తమ సొంత స్థలంలో ఉందని రెండు కుటుంబాలకు చెందిన వారు మూడేళ్ల క్రితం పూడ్పించారు. అయితే ఆ స్థలం వారిది కాదని.. అది గ్రామ కంఠం పరిధిలో ఉందని ఇటీవల ఆ గ్రామానికి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బావిని తిరిగి తవ్వుకోవచ్చని కోర్టు ఆదేశాలిచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ.. బావిని తిరిగి తవ్వించే పనులను చేపట్టారు.
ఈ క్రమంలో ఆదివారం కూడా ఆ పనులు కొనసాగాయి. అయితే.. తమ నాయకుడి ఇంటి ముందు బావిని తిరిగి తవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అంటూ గతంలో బావిని పూడ్పించిన కుటుంబాల ఇళ్లపై ఎమ్మెల్సీ అనుచరులు కొడవళ్లు, రాళ్లతో దాడికి సిద్ధమై హల్ చల్ చేశారు. పోలీసులు వారిని నిలువరిస్తున్నా.. బాధితుల ఇంటిపై రాళ్లు రువ్వుతూ దాడికి యత్నించారు. పోలీసులు వారిని కట్టడి చేయడంతో చివరకు పరిస్థితి సద్దుమణిగింది.
ఈ ఘటనపై బాధిత మహిళ వజ్రకరూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ వెంకటస్వామి చెప్పారు. సీఐ శేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :
ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. ఒకరు మృతి