ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Road Issue: పక్కకు తోసేశారు.. పచ్చని పొలాల్ని దున్నేశారు..!

దారి కోసం రెవెన్యూ అధికారులు పచ్చని వరి పంటను ట్రాక్టరుతో తొక్కించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. సదరు రైతు కుటుంబం అడ్డుపడినా... అధికారులు వెనక్కి తగ్గలేదు. ఒకదశలో సదరు కుటుంబం విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయంలో సీఎం జగనే న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

MLA follwers attack
పక్కకు తోసేశారు... పచ్చని పొలాల్ని దున్నేశారు...

By

Published : Oct 24, 2021, 3:31 PM IST

పక్కకు తోసేశారు... పచ్చని పొలాల్ని దున్నేశారు...

అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొర్రపాడు గ్రామంలో పొలానికి దారి ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు పచ్చని వరి పంటను ట్రాక్టరుతో తొక్కించారు. దీంతో బాధిత రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. కొర్రపాడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుటుంబానికి సర్వేనెంబరు 141, 142లో 5.40 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో వరి సాగు చేశారు. రెండు నెలల తర్వాత పంట చేతికి రానుంది. కొర్రపాడు నుంచి జంతులూరు గ్రామం వరకూ ఈ పొలం మీదుగా ఇతర పొలాలకు వెళ్లడానికి బండి రస్తా ఉందని రెవెన్యూ అధికారులు సదరు రైతు కుటుంబానికి నోటీసులు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రస్తా ఏర్పాటు చేయాలని పోలీసుల సాయంతో వరి పైరును ట్రాక్టరుతో తొక్కించే ప్రయత్నం చేశారు. రైతు కుటుంబం తీవ్రంగా ప్రతిఘటించింది. అధికారులు పట్టించుకోకపోవడంతో బాధిత రైతులు విద్యుత్తు తీగలు పట్టుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు దారి ఏర్పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

సీఎం జగనే న్యాయం చేయాలి: బాధిత రైతు కుటుంబం

అనంతరం బాధిత రైతు కుటుంబసభ్యులు మాట్లాడుతూ శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి తమ పొలం కింది వైపు భూములు కొన్నారని, వారి పొలానికి వెళ్లడానికి దారి కోసం అధికారులు, పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా తమ పొలంలో దారి ఉంటే వరి పంట పూర్తయ్యాక ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు వినలేదని, వరి పైరును ట్రాక్టరుతో తొక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని వారు వాపోయారు. ఈ విషయంపై తహసీల్దారు మహబూబ్‌బాషా వివరణ కోరగా 141, 142 సర్వేనంబరులో బండి రస్తా ఉందని తెలిపారు. ఇతర రైతుల అభ్యర్థన మేరకు రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పంట పూర్తవకుండానే వరి పొలాన్ని ట్రాక్టరుతో ఎందుకు తొక్కించారని ప్రశ్నించగా.. నష్టపరిహారం ఇస్తామని సమాధానమిచ్చారు. దారి ఏర్పాటులో ఎమ్మెల్యే పద్మావతి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి :

YCP Vs TDP: రాష్ట్రంలో హైవోల్టెజ్ రాజకీయం.. తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్షం

ABOUT THE AUTHOR

...view details