అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం రాత్రి విధులకు గైర్హాజరైన వైద్యురాలు సుకన్యను సస్పెండ్ చేయాలని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సోమవారం ఉన్నతాధికారులకు హుకూం జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలో తాగునీటి విషయంలో జరిగిన ఘర్షణలో వైకాపాకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు మంత్రి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు సమస్యలు, వైద్యశాలకు వచ్చిన వారికి చికిత్స అందించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్ సుకన్యను సస్పెండ్ చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.