విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఈడీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్య రథాన్ని ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలసి ఆయన ప్రారంభించారు.
విద్యార్థులు, నిరుద్యోగ యువతకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ.. వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాల ద్వారా శిక్షణనిస్తోందని మంత్రి వెల్లడించారు. నెపుణ్య రథంలో ఒక బ్యాచ్‌కు 20 మంది చొప్పున.. 8 బ్యాచ్‌లకు 20 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఎంఎస్ ఆఫీస్(MS Office), ఫోటో షాప్ (Photoshop), కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills), బయో డేటా(Bio-Deta) తయారు చేసుకునే విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్ గౌడ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.