రాయలసీమలో కరవును పారద్రోలేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హమీ మేరకు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని 193 చెరువులను నింపేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శనగా వచ్చారు. ప్రదర్శన నల్లమాడ చేరుకున్న తరువాత బహిరంగసభ నిర్వహించారు.
ఆనాడు వైఎస్సార్ హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారని.. ఈ రోజు ఆయన తనయుడు జగన్ పుట్టపర్తిలోని 193 చెరువులు నింపి కరువును తరిమికొట్టేందుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి జగన్కు జీవితాంతం రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. జగన్ సంక్షేమ పాలనతో తెదేపా నాయకుల్లో వణుకు పుడుతోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.