'విత్తు నాటినప్పటి నుంచి విక్రయించే వరకూ మనదే బాధ్యత'
గ్రామ సచివాలయాలకు ఎంపికైనా వ్యవసాయ సహాయకులు... రైతులకు సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కన్నబాబు కోరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ సహాయకులు... నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. రైతులు విత్తు నాటిన నుంచి ధాన్యం విక్రయించే వరకు చేదోడుగా ఉండాలన్నారు.
గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు అన్నివేళలా అన్నదాతకు అందుబాటులో ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. వేరుశనగ వంగడాల వివరాలను శాస్త్రవేత్తలు కన్నబాబుకు వివరించారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాలకు ఎంపికైన వ్యవసాయ సహాయకుల శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతులకు మార్గనిర్దేశం చేసేందుకు సహాయకులను నియమించామని కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే లక్షా 40 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ సహాయకులు రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకుని అన్నదాతకు అండగా నిలవాలని మంత్రి సూచించారు.