ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించిన తెలంగాణ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత - చంద్రబాబుపై కవిత

Harish Rao, Kavitha Counter to Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథాన తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో సాగవని ఆరోపించారు. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కరే అని పేర్కొన్నారు.

Minister Harish Rao, MLC Kavitha
మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత

By

Published : Dec 22, 2022, 5:29 PM IST

Harish Rao, Kavitha Counter to Chandrababu : చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అన్ని వర్గాలను ఆయన మోసం చేశారని విమర్శించారు. బుధవారం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబుపై హరీశ్‌ విమర్శలు గుప్పించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో సహచర మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని హరీశ్‌రావు అన్నారు. ఏపీలో అభివృద్ధి చేయలేక తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారని విమర్శించారు. తెలంగాణలో తమకు బలముందని చూపించి భాజపాతో పొత్తు కోసమే ఆయన ఈ విధంగా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఖమ్మం సభకు పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని హరీశ్‌ ఆరోపించారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు.

''ఏపీని అభివృద్ధి చేయలేక..తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ఉద్యోగాలు అడిగిన యువతను నక్సలైట్లతో కాల్చి చంపారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నినాదం ఐటీ. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు. భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. భాజపా పొత్తుకోసమే వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్‌ విలక్షణ నేత.. ఆయన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు.''- హరీశ్‌రావు, తెలంగాణ మంత్రి

తెలంగాణలో సాగవు:టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ రాజకీయాలు తెలంగాణలో సాగవని ఆరోపించారు. ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కరే అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారు.. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్లు కాదు. టీడీపీని ప్రజలు ఇప్పటికే రిజక్ట్‌ చేశారు. ఇప్పుడొచ్చి రాజకీయం చేద్దామనుకున్నా మళ్లీ రిజక్ట్‌ చేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై కవిత విమర్శనాస్త్రాలు

రైతులపై భాజపాకు ఎందుకంత కక్ష: కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు వ్యతిరేకమేనని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులపై బీజేపీకి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. కల్లాలు కట్టడమే తప్పన్నట్లు పరిహారం చెల్లించాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో భారాస ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.

''కేసీఆర్‌ నాయకత్వంలోనే ఖమ్మానికి వైభవం. ఖమ్మం అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత చంద్రబాబు అన్యాయం చేసింది ఖమ్మం జిల్లాకే. చంద్రబాబు తన పలుకుబడితో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం చేయించారు. ప్రధానిపై ఒత్తిడి చేసి సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలుపుకొన్నారు. చంద్రబాబు హయాంలో ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టైనా తెచ్చారా?. ఖమ్మానికి ఒక్క ప్రాజెక్టు తెచ్చినా నేను ముక్కు నేలకు రాస్తా. ఖమ్మం జిల్లాకు ఒక్క పరిశ్రమ లేదా ప్రాజెక్టైనా తీసుకొచ్చారా? చంద్రబాబు చెబుతున్న ఐటీని ఖమ్మానికి తీసుకొచ్చింది కేసీఆర్‌, కేటీఆర్‌. తెలంగాణ వచ్చాక ఖమ్మం అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. తన హయాంలో ఖమ్మానికి వైద్య కళాశాల వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆ కళాశాల నాది.. నా కష్టార్జితంతో ఏర్పాటు చేశా. నా కళాశాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది. ఖమ్మం ప్రజలమంతా సుఖంగా ఉన్నాం.. మమ్మల్ని ఆగం చేయొద్దు.'' - పువ్వాడ అజయ్, తెలంగాణ మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details