ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీ నేతల బెదిరింపులు.. పారిపోతున్న క్వారీ యజమానులు - Kalyanadurgam Constituency

Anantapur District: వ్యాపారంలో సగభాగం ఇవ్వాలి.. లేదా ప్రతినెలా చెప్పిన మొత్తం ఇంటికి పంపించాలి.. ఇది ఆ ప్రజాప్రతినిధి హుకుం. ఇప్పటికే లక్షలాది రూపాయలు ముట్టజెప్పుతున్నా.. ఆ ప్రజాప్రతినిధి అత్యాశకు పోతుండటంతో మైనింగ్​ యజమానులు క్వారీలు వదిలిపోతున్నారు. ఇప్పటికే ఏడు క్వారీలు మూతపడటంతో కూలీలకు ఉపాధి లేకుండాపోతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధి బెదిరింపులతో వ్యాపారం చేయలేమంటూ క్వారీలు వదిలేసి భయంతో పారిపోతున్న వైనంపై కథనం.

Anantapur District
Anantapur District

By

Published : Mar 7, 2023, 3:59 PM IST

అధికార పార్టీ నేతల బెదిరింపులు.. పారిపోతున్న క్వారీ యజమానులు

Anantapur District: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి, వారి బంధువుల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయనే విమర్శలున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తున్న ఆ ప్రజాప్రతినిధి, ఇసుక, మట్టిని కూడా వదలని పరిస్థితిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగానే ఆ ప్రజాప్రతినిధి, వారి బంధువులు తాజాగా మైనింగ్ యజమానులపై దౌర్జన్యానికి దిగినట్లు విమర్శలున్నాయి. శెట్టూరు మండలంలోని ములకలేడు పంచాయతీలో పలు గ్రామాల్లో ఎనిమిది చోట్ల క్వారీలు నడుస్తున్నాయి. పలువురు యజమానులు దాదాపు ఇరవై ఏళ్లుగా అక్కడ నల్లరాతి గుండ్లు పెకలించి ఎగుమతి చేస్తున్నారు. విలువైన ఈ నల్లరాతికి పలు దేశాలతోపాటు దక్షిణ భారతదేశంలో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతి చేసేవారు. సజావుగా వ్యాపారం జరుగుతోందని భావిస్తున్న క్వారీ యజమానులపై ఈ మధ్య ప్రభుత్వం పన్నుల భారం విపరీతంగా పెంచింది. పెరిగిన రాయల్టీతో సతమతమవుతున్న క్వారీ యజమానులపై వైసీపీ ప్రజాప్రతినిధి దౌర్జన్యం తోడవటంతో చేసేదిలేక క్వారీ యంత్రాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. దాదాపు వెయ్యి మందికి రోజూ ఉపాధి కల్పించే క్వారీలు మూతపడటంతో ఆయా గ్రామాల్లోని కూలీలంతా సమీపంలోని కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. క్వారీ మూతపడి తమ జీవనోపాధి పోయిందని గ్రామస్థులు చెబుతున్నారు.

శెట్టూరు మండలంలోని ములకలేడు రెవెన్యూ గ్రామ పరిధిలోని తిప్పనపల్లి, పెరుగుపాళ్యం, అనుంపల్లి, బడ్డయ్యదొడ్డి గ్రామాల్లో క్వారీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎనిమిది క్వారీల ద్వారా చాలా ఏళ్లుగా మైనింగ్ పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధి బెదిరింపులతో ఏడు చోట్ల క్వారీలు మూతపడినట్లు ఆరోపణలున్నాయి. క్వారీలో 50 శాతం వ్యాపార వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగటంతో పలువురు క్వారీ యజమానులు గతంలో ఆ ప్రజాప్రతినిధిని, కుటుంబ సభ్యులను కలిశారు. వాటా ఇవ్వలేమని, ప్రతినెలా కొంత మొత్తం ఇస్తామని మాట్లాడుకొని వచ్చినట్లు సమాచారం. దాదాపు ఏడాది కాలం ప్రతినెలా మామూళ్లు పొందుతున్న ప్రజాప్రతినిధి బంధువు, తమకిచ్చేది సరిపోవటంలేదని యజమానులపై మళ్లీ వత్తిడి పెంచారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలున్నాయి. దీంతో చేసేదేమీలేక ఏడు క్వారీలు మూతపడినట్లు ఆరోపణలున్నాయి. ఒక క్వారీ యజమానిగా ఉన్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధి దౌర్జన్యాన్ని తిప్పికొట్టినట్లు సమాచారం.

అయితే తన క్వారీ జోలికి రాకుండా వైసీపీలోని మరో ప్రజాప్రతినిధి సహకారంతో అమరావతిలోని సలహాదారుడి ఆశీస్సులతో కళ్యాణదుర్గం ప్రజాప్రతినిధి నోరు మూయించినట్లు తెలిసింది. దీంతో తిప్పనపల్లి పరిధిలోని ఒక క్వారీ మాత్రం మైనింగ్ పనులు కొనసాగిస్తున్నట్లు స్థానిక కూలీలు చెబుతున్నారు. ఏడు క్వారీలు మూత పడటంతో దాదాపు వెయ్యి మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. ప్రతినెలా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించే మైనింగ్ యజమానులకు రక్షణగా నిలవాల్సిన జిల్లా అధికార యంత్రాంగం అటువైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధి బెదిరింపులతోనే క్వారీ యజమానులు వెళ్లిపోతున్నారని చెబుతున్న అధికారులు, తాము ఏమీ చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details