జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, గనుల శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండటం, కొండంత అండగా ‘అధికారం’.. వెరసి అనంతపురంలోని నేమకల్లు క్వారీల్లో అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఇక్కడ గతంలో అవినీతి, అక్రమాలు బయటపడటంతో అధికారులు పెద్దఎత్తున జరిమానాలు విధించారు. తర్వాత స్థానికుల ఫిర్యాదుతో నిషేధాజ్ఞాలు కూడా అమలు చేశారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కంకర క్వారీలో అక్రమ తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక్కడి క్వారీల్లో ఖనిజ తవ్వకాలు, రవాణాను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నిషేధించింది.
అయితే.. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకున్నారు. గతంలో ఇదే క్వారీని సదరు ప్రజాప్రతినిధి లీజుకు తీసుకుని నడిపించారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంతో రూ.1.90 కోట్ల మేర జరిమానా విధించారు. తర్వాత ఆ క్వారీని ఆ ప్రజాప్రతినిధి గనుల శాఖకు సరెండర్ చేశారు. తిరిగి కుటుంబ సభ్యుల పేరుమీద లీజు అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున ఖనిజాన్ని తరలిస్తున్నారు. అక్కడ తవ్విన కంకర రాళ్లను నేమకల్లు పరిసర ప్రాంతాల్లోని 15 క్రషర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆ రెండింటికే అనుమతి
నేమకల్లు పరిసర ప్రాంతాల్లో కాలుష్యం అధికం కావడంతో స్థానికులు 2017లో ఎన్జీటీని ఆశ్రయించారు. సమగ్ర విచారణ చేపట్టిన ఎన్జీటీ అధికారులు నేమకల్లు కొండల్లోని 19 కంకర క్వారీలపై నిషేధం విధించారు. ఎలాంటి పేలుళ్లు, తవ్వకాలు, రవాణా చేపట్టకూడదని ఆదేశించారు. దీనిపై క్వారీ యజమానులు ఎన్జీటీని సంప్రదించి, తమకు న్యాయం చేయాలని గతేడాది కోరగా.. నేమకల్లులో క్రషర్లకు మాత్రమే అనుమతి లభించింది.
తవ్వకాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గత జనవరి, మార్చి నెలల్లో కొత్త క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నారు. పర్యావరణ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. ఇక్కడ విశేషమేమంటే లీజులు కొత్తవే అయినప్పటికీ తవ్వే ప్రాంతం మాత్రం పాతదే. గతంలో సదరు ప్రజాప్రతినిధి సరెండర్ చేసిన క్వారీల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. నేమకల్లులో 19 క్వారీలుండగా, రెండింటిలో మాత్రమే తవ్వుకోవడానికి గనులు, భూగర్భశాఖ అనుమతులు జారీ చేయడం విమర్శలకు దారితీస్తోంది.
నిబంధనల ఉల్లంఘన
ఈ వ్యవహారంలో కొత్త లీజు నామమాత్ర ప్రక్రియగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా కంకరను అక్రమంగా క్రషర్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇటీవల తెచ్చుకున్న లీజు ప్రాంతాల్లో కాకుండా.. పాత క్వారీల్లో తవ్వకాలు పెద్దఎత్తున చేపడుతుండటం గమనార్హం. ఇది గనుల నిబంధనలు ఉల్లంఘించడమే. డిటోనేటర్లు, స్లర్రీలతో బ్లాస్టింగ్ చేపడుతున్నారు. క్వారీల్లో హద్దులు దాటి తవ్వకాలు జరుపుతున్నారు. తవ్విన ఖనిజాన్ని బయట ప్రాంతాలకు రవాణా చేస్తే.. బరువుకు తగ్గట్టు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతున్నా వేయింగ్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
ఒకే సర్వే నెంబరుతో..