పట్టెడన్నం కూడా పెట్టలేకపోయారు...
ఎక్కడ బెంగళూరు....ఎక్కడ ఉత్తరప్రదేశ్...వేల కిలోమీటర్లు కాళ్లరిగిపోయేలా నడుస్తున్నారు వారంతా. ఓవైపు ఆకలి అవుతున్నా.. దారివెంట వెళ్లేవారు గుక్కెడు నీరిస్తే చాలనుకొని వేల కిలోమీటర్లలోని తమ గ్రామాలకు పయనమవుతున్నారు. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తులన్నీ వారి చేతులమీదుగనే నిర్మాణాలయ్యాయి. పొట్ట చేతపట్టుకొచ్చిన ఆ పేదలకు పట్టెడన్నం పెట్టలేకపోయింది కర్ణాటక ప్రభుత్వం. లాక్ డౌన్ తెచ్చిన కష్టాలతో ఉపాధి కోల్పోయి... చేతిలో చిల్లిగవ్వలేక కాళ్లనే చక్రాలుగా చేసుకొని స్వగ్రామాలకు వెళుతున్నారు. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై పసికందులను పట్టుకొని ఎండను లెక్కచేయకుండా వేల కిలోమీటర్లు నడిచివెళుతున్న వలస కూలీలను అనంతపురంలో సీపీఎం, ప్రజాసంఘాలు అక్కున చేర్చుకుంటున్నారు.
వలస కూలీలపై పోలీసులు లాఠీల ప్రతాపం ...
బెంగుళూరు నగరం పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అభివృద్ధికి ప్రత్యక్షంగా నిలిచే ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు, మల్టీ కాంప్లెక్స్ ల నిర్మాణాలు. పారిశ్రామిక ఉత్పత్తులు అనేకం వలస కార్మికుల చేతులమీద అభివృద్ధి జరిగినవే. దశాబ్ధాల కాలంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బెంగుళూరు నగరానికి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన లక్షలాదిమంది రెక్కల కష్టం మీదనే ఇవాళ బెంగుళూరు నగరం అభివృద్ధి సాధించింది. రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రనక, పగలనక కష్టం చేసిన ఉత్తరాది వలస కార్మికులు నేడు అక్కడి ప్రభుత్వానికి, సమాజానికి అక్కర లేకుండా పోయారు. నమ్ముకొని వచ్చిన మేస్త్రీలు మోసం చేయటమే కాకుండా.... ఇవ్వాల్సిన కూలీ డబ్బులు కూడా ఎగ్గొట్టటంతో... పట్టెడన్నం కోసం తపించిపోతున్నారు. కనీసం వీధుల్లోకి వచ్చి అడుక్కుందామన్నా.... పోలీసులు లాఠీలు విరిగేలా వలస కూలీలపై తమ ప్రతాపం చూపుతున్నారు. గదులు అద్దెకిచ్చిన యజమానులు సామాన్లు బయటపడేయటంతో... దిక్కుతోచని స్థితిలో వేల కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి ఊహకందనిది.