రోజూ కష్టాలు పీడించేవి. వస్త్ర తయారీ పరిశ్రమ ఉన్న చోటే వ్యాపారం ప్రారంభిస్తే దుకాణం సర్దేయాల్సిందే అంటూ ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు...ఏ దారీ లేక ఈ మార్గం ఎంచుకున్నారంటూ అవమానాలు అన్నీ భరించారు. ఆ కుటుంబం ఆత్మస్థైర్యం, పట్టుదల కోల్పోలేదు. అనంతపురం జిల్లా గార్మెంట్ పరిశ్రమకు పెట్టిందిపేరు. ఈ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు పామిడికి చెందిన పర్వీన్, ఫకృన్నిసా.
లక్షల రూపాయల పెట్టుబడులు అవసరమైన వస్త్ర తయారీ రంగం... ఒకప్పుడు పేదలకు అందుబాటులో ఉండేది కాదు. అయితే మెప్మా సహకారంతో దూసుకెళ్తున్నారు నిరుపేదలు మహిళలు.
కుటుంబపోషణే భారంగా, కఠిన దారిద్య్రం అనుభవిస్తున్న మహిళలకు... మెప్మా సహకరించింది. టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు ఇప్పించి... తక్కువ వడ్డీకి రుణాలూ అందేలా చూస్తోంది. ఫలితం.. కష్టాలకు టాటా చెప్పేసి వస్త్రతయారీ రంగంలో దూసుకెళ్తున్నారు. మహిళల కోట్స్ తయారీ పరిశ్రమతో పాటు... వివిధ మతాల మహిళలు ధరించే వస్త్రాలనూ తయారు చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు....దిల్లీ, జమ్మూ కాశ్మీర్ వరకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఫోన్ ద్వారా గార్మెంట్ కోసం ఆర్డర్లు చేస్తూ... ముందుగానే ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారు.