అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకూ 8 లక్షల 90 వేల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండు డోసులను అందించామని జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. అనంతపురం రెండో రోడ్డులోని సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సిరి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని వారు కోరారు. చిన్నపిల్లల తల్లులు వ్యాక్సినేషన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కర్ఫ్యూను సడలింపు ఇచ్చిందని.. ప్రజలు అజాగ్రత్తగా ఉండరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాటిని అలానే కొనసాగించాలని కోరారు.
టీకా వేసుకో సిల్వర్ కాయిన్ వస్తుందేమో చూసుకో..
వాక్సిన్ వేసుకున్న వారికి లేపాక్షి మండల తహసీల్దార్ బలరాం బంపర్ ఆఫర్ ప్రకటించారు. మండల వ్యాప్తంగా 12 పంచాయతీలలో నేడు (ఆదివారం) వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఒక్కో పంచాయతీ నుంచి ఒక్కరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వెండి కాయిన్(5 గ్రాములు) బహుమతిగా ఇస్తామని అన్నారు. తహసీల్దార్ పిలుపుతో మండల వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలలో అవగాహన పెంచేందుకు బహుమతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు తహసీల్దార్ బలరాం తెలిపారు. మండల వ్యాప్తంగా 100% వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయాలన్నది తమ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన వ్యాక్సినేషన్‌ను లేపాక్షి మండలంలో తమ వంతుగా దిగ్విజయంగా పూర్తి చేయాలని నిర్దేశించుకున్నాం. పలు పంచాయతీలు వెళ్లి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించా. రేపు మండల కార్యాలయంలో 12 పంచాయతీలలో ప్రజలకు ఇచ్చిన టోకెన్లను లక్కీ డ్రా తీస్తాం. వెంటనే గెలుపొందిన విజేతలకు సిల్వర్ బహుమతులు ప్రదానం చేస్తాం. - తహసీల్దార్ బలరాం.