మరో రెండేళ్లలో కుమార్తెను వైద్యురాలిగా చూస్తామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తూ ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరిలోని రైల్వే స్టేషన్‌రోడ్‌లో నివాసముండే జైనుల్లా, మహబూబ్ చాంద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి పెద్ద కుమార్తె రాఫియా అంజుమ్. అంజుమ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. అంజుమ్ తండ్రి కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి మంచానికే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో మూడు నెలలుగా రాఫియా అంజుమ్ అన్యమనస్కంగా ఉండేదని ఆమె తల్లి మహబూబ్ చాంద్ తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న రాఫియా తరచూమాత్రలను వాడేదని, వారించినా వినిపించుకునేదికాదన్నారు. కుమార్తె పరిస్థితిని గుర్తించిన ఆమె నెల రోజుల కిందటే తిరుపతి నుంచి ఇంటికి తీసుకునివచ్చింది.
Medico Suicide: ఉరివేసుకుని వైద్యవిద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లా కదిరిలో ఓ వైద్య విద్యార్థిని ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిరోజులుగా మానసికంగా ఇబ్బందిపడుతున్న కుమార్తెను కళాశాల నుంచి తల్లి ఇంటికి తీసుకువచ్చింది. కాగా ఇంట్లో తల్లిలేని సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
శనివారం ఉదయం రాఫియా తల్లి విధులకు వెళ్లగా, ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె సోదరి పాఠశాలకు వెళ్ళింది. తండ్రితో పాటు ఇంట్లో ఉన్న రాఫియా అంజమ్ మధ్యాహ్నం తండ్రికి మాత్రలు ఇచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె తల్లి తలుపులు తెరిచి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి భోరున విలపించింది. అప్పటికే మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ శ్రీనివాసులుతెలిపారు.
ఇదీ చదవండి: తాడిపత్రిలో వైకాపా నాయకుడి హత్య