లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు భద్రత, ఉపాధి కరువైన తరుణంలో... అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ సంస్థ మాస్కుల తయారీ, పంపిణీకి శ్రీకారం చుట్టింది. గుంతకల్లులోని సంస్థ ప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో నివసించే మహిళలకు టైలరింగ్ శిక్షణా తరగతులు ఇప్పించి.. వారికి రోజు ఉపాధి లభించేలా మాస్కులు కుట్టే పని కల్పించారు. దాదాపు 2 వేల మంది మహిళలు... రోజుకు 150 నుంచి 200 దాకా మాస్కులు తయారుచేస్తున్నారు. 700 నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
రోజుకు రూ. 1000 ఆర్జిస్తున్నాం
గుంతకల్లు పట్టణంలో ఉపాధి లేక ఇంటి దగ్గరే ఉన్న కూలీలను గుర్తించి వారితో మాస్కులు కుట్టించి... తగినంత సొమ్మును ఇచ్చి ఆదుకుంటోంది ఆర్డీటీ సంస్థ. లాక్డౌన్ నేపథ్యంలో కష్టాలు పడుతున్న తరుణంలో ఆర్డీటీ సంస్థ సభ్యులు తమను గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించారని లబ్ది పొందిన మహిళలు తెలియజేశారు. సకాలంలో ప్రజలకు మాస్కులు అందించి కరోనా నుంచి కాపాడటంలో తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. రోజుకు 200 మాస్కులు కుట్టి... దాదాపు రూ. 1000 వరకు సంపాదిస్తున్నామని మహిళలు తెలిపారు.