అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో.. ఓ ముస్లిం మహిళ అంత్యక్రియల్లో శవపేటికను బంధువులతో కలిసి స్థానిక ఎస్సై శేషగిరి మోశారు. మడకశిరలో కార్పెంటర్ వృత్తి చేసుకొని జీవనం సాగించే బాబావలీ అనే వ్యక్తికి పోలీసులంటే అమిత గౌరవం. అతని తల్లి ప్యారీమ.. అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై శేషగిరి.. బాబావలీ ఇంటికి వెళ్లి ఆమె తల్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు.
అనంతరం శవపేటిక (జనాజా)ను తోటి సిబ్బందితో కలిసి మోశారు. శ్మశానవాటిక సమీపం వరకు సిబ్బంది బంధువులతో కలిసి మోసుకెళ్లారు. ఈ ఘటనను పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కులమతాలకు అతీతంగా వ్యవహరించిన ఎస్సై, ఇతర పోలీసుల తీరును ప్రజలు ప్రశంసించారు.