అనంతపురం జిల్లా మడకశిర మండలంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని ఈచలడ్డి, జమ్మాన్పల్లి, గుర్రపుకొండ, హరేసముద్రం గ్రామాలలో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. మండలవ్యాప్తంగా 11 ఇళ్లు వర్షానికి దెబ్బతిన్నాయని... వారికి వెంటనే ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం భారీ వర్షాలకు మండలంలోని హరేసముద్రం, బుళ్ళసముద్రం, వై.బి.హళ్ళి, గౌడనహళ్ళి, చందకచర్ల, మెళవాయి గ్రామాల్లో జరిగిన పంటనష్టంపై ఆరా తీశారు. 10 మంది రైతుల చెందిన 6.55 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. త్వరలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని తహసీల్ధార్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రెవెన్యూ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.