వైకాపా నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కూల్చటమే తప్ప నిర్మించటం తెలియని వైకాపా నాయకులు మరో దళిత కుటుంబంపై దమనకాండకు పాల్పడ్డారని మండిపడ్డారు. తెదేపా సానుభూతిపరులనే కారణంతో అనంతపురం జిల్లా నిజవల్లిలో హనుమంత రాయుడు అనే దళితుడి ఇంటిని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని లోకేశ్ అన్నారు. కక్షతో దళితులకు చెందిన ఇంటిని కూల్చిన వైకాపా నాయకుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..:అనంతపురం జిల్లా నిజవళ్లి గ్రామానికి చెందిన దళితులైన హనుమంత రాయుడు, అనంతలక్ష్మీ దంపతులు ఊరి శివారులో పోలేపల్లికి వెళ్లే రహదారి పక్కన ఉన్న స్థలంలో మేకలదొడ్డి ఏర్పాటు చేసుకుని అందులోనే ఇల్లు కట్టుకుని 15 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వారు తెదేపా సానుభూతిపరులని, వారు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, అక్కడి నుంచి ఖాళీ చేయించాలని... గత ఎన్నికల్లో వైకాపా మద్దతుతో సర్పంచిగా గెలిచిన ప్రభాకర్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై ఆ దంపతులను పలుమార్లు హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే అండతో తహసీల్దారుపై 8 నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. రెండునెలల కిందట తహసీల్దార్ గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి మరో స్థలం కేటాయిస్తామని, ఖాళీ చేయాలని చెప్పారు. కేటాయించిన స్థలం పట్టా చూపి కాగితాలు అందిస్తే ఖాళీ చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. అధికారులు ఎక్కడా స్థలం కేటాయించలేదు.
దంపతులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి...:శనివారం ఉదయం హనుమంత రాయుడు, అనంతలక్ష్మీ పొలం పనిలో నిమగ్నమై ఉండగా పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కళ్యాణదుర్గం గ్రామీణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కంబదూరు, శెట్టూరు, కుందుర్పి ఎస్సైలు... సిబ్బంది, కళ్యాణదుర్గం నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాన్ని పెద్ద ఎత్తున గ్రామంలో మోహరించారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్ జమానుల్లాఖాన్... రెవెన్యూ సిబ్బందిని తీసుకెళ్లి బాధితుల ఇంటిని పొక్లెయిన్‌తో కూల్చి, సామగ్రిని బయట పడేశారు. గ్రామస్థుల్ని ఆ పరిసరాల్లోకి రాకుండా పోలీసులు నిలువరించారు. ఆ సమయంలో సర్పంచి ప్రభాకర్, ఎంపీపీ భర్త నాగరాజు, డీలర్ గోపాల్ అక్కడే ఉన్నారు.