దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా జీవనోపాధి కల్పిస్తున్న రంగం చేనేత. కానీ లాక్‌డౌన్ చేనేత కార్మికుల బతుకులను దుర్భరంగా మార్చేసింది. చేద్దామంటే పనిలేదు. చేసిన పనికి కూలీ రాదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 76వేలు చేనేత మగ్గాలున్నాయి. లక్షన్నర మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అనంతపురం జిల్లాలో చేనేత కాకుండా మరమగ్గాలు 15వేల వరకు ఉన్నాయి. లాక్‌డౌన్ వేళ చేనేత కుటుంబాల జీవన స్థితిగతులపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక దయనీయమైన పరిస్థితులు కనిపించాయి.
అనంతపురం జిల్లాలో ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, తాడిపత్రి, యాడికి, సోమందేపల్లి ప్రాంతాల్లో చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాకుండా రాయదుర్గం, ఉరవకొండ, పుట్టపర్తిలో చేనేత టెక్స్టైల్ పార్కులు విస్తరించి ఉన్నాయి. ఏటా మూడు లక్షల వరకు పట్టుచీరలు తయారుచేసే నేత కార్మికుల ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. చేనేతలు తాము నేసిన వస్త్రాలు వ్యాపారులకు ఇచ్చినప్పటికీ, అవి అమ్ముడపోలేదని ఒక్క రూపాయి కూడా చేతికివ్వని పరిస్థితి ఉంది. నేతన్నల కష్టంతో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు నిరుపేద నేత కళాకారులపై కనీస దయ కూడా చూపటం లేదు.