సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ధర్నాకు దిగాయి. వ్యవసాయాన్ని కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నేతలు నినాదాలు చేశారు.
అనంతపురం జిల్లాలో..
కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట.. రైతు సంఘం నేతలు, సీఐటీయూ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, శంకర్ రెడ్డి, బాబు నాయుడు, కృష్ణారెడ్డి, సీఐటీయూ నాయకులు జి.ఎల్.నరసింహులు, జగన్మోహన్, ముస్తాక్, రామ్మోహన్, ఫిరోజ్ ఖాన్ ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్, జిలాన్ పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో...
చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని నినదించారు. తెదేపా సీపీఐ, సీపీఏం తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో...
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో ప్రజా సంఘల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరుతున్నా... ప్రధానమంత్రి పట్టించుకోవడంలేదని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా... ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం వేశారన్నారు.
ఎమ్మిగనూరులో.. రైతులకు గుదిబండగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సోమప్ప కూడలిలో వామపక్షాలు ధర్నా చేశాయి. కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవలని హెచ్చరించారు. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్రోల్ ,డీజిల్ ధరలు అమాంతంగా పెరిగి అన్ని రంగాలపై భారం పడుతుందని వామపక్ష నాయకుడు పొంపన గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో...
గూడూరు పట్టణం టవర్ క్లాక్ సెంటర్ వద్ద రైతు కూలీ సంఘం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో ధర్నా చేపట్టారు. రైతాంగ సమస్యలపై గత ఏడు నెలలుగా దిల్లీలో పోరాడుతున్న రైతుల ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారని గుర్తుచేశారు. రైతులు పోరాడుతుంటే కనీసం వారితో కూర్చుని చర్చించే ఓపిక నరేంద్రమోదీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.