అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ, వామపక్షాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి యత్నించాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉరవకొండలోని పేదల ఇళ్ల నిర్మాణం కోసం 20ఏళ్లుగా అనేక ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేశామని సీపీఐ, సీపీఎం నాయకులు అన్నారు. తమ పోరాటంతో తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందున లబ్ధిదారులకు స్థలాలు చూపడం ఆగిపోయిందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో అవకతవకలు జరిగాయనటం సబబు కాదన్నారు.
ఉరవకొండ పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలి: వామపక్షాలు
ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోనే పట్టాలు పంపిణీ జరిగాయని, అప్పుడు కనపడని అవకతవకలు ఇప్పుడెలా కనిపించాయని వామపక్షాలు ప్రశ్నించాయి. గతంలో ఇచ్చిన పట్టాలకు స్థలం చూపకుండా చెక్కుబందీలు లేవనడం దారుణమని నేతలు వాపోయారు. ప్రభుత్వం మళ్లీ లిస్టులు తయారు చేస్తుండటం విడ్డురంగా ఉందని విమర్శించారు. ఇళ్ల స్థలాల విషయంలో పేద ప్రజలతో ఆడుకోవాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు .
ఇదీ చదవండి: ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుల నిరసన