అనంతపురం జిల్లాలో అయిదు దశాబ్దాల పాటు నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లిన గోరంట్ల మేజర్ పంచాయతీ జిల్లాలోని పెద్దమండలాల్లో ఒకటి. పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, పాలసముద్రం సమీపంలో కేంద్రప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో గోరంట్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటిసారి ఎస్టీ మహిళకు సర్పంచి స్థానం రిజర్వు కావడంతో ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. మండలం పెద్దది అయినప్పటికీ మూడో వంతు జనాభా, అదే స్థాయిలో ఓటర్లు గోరంట్ల పంచాయతీలోనే ఉండటంతో రెండు పార్టీల నాయకులు గోరంట్లలో పాగా వేయాలనుకుంటున్నారు. జనాభా 24,617 మంది. ఓటర్ల సంఖ్య 19,615. అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల కుటుంబాలున్నాయి. మరో వెయ్యి వరకు రికార్డులోకి నమోదు కావాల్సి ఉంది.
పేరు గొప్ఫ. ఊరు దిబ్బ!
అభివృద్ధిలో దూసుకుపోతున్న గోరంట్లలో ఏళ్ల తరబడిగా తిష్ట వేసుకున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా తాగు నీటిసమస్య వేధిస్తోంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం తలనొప్పిగా మారింది. గుమ్మయ్యగారిపల్లి నుంచి తిప్పరాజుపల్లి వరకు ఏర్పడిన గుంతలు వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేలసంఖ్యలో వాహనాలు తిరిగే మార్గం కావడంతో దుమ్ముతో స్థానికులు అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. పాత, కొత్త గోరంట్లకు వారధిగా ఉన్న చిత్రావతి నదిపై నూతన వంతెన నిర్మాణం నత్తతో పోటీపడుతోంది. మూడేళ్ల కిందట శంకుస్థాపన జరిగినా నేటికీ పూర్తికాలేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.
ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడే వ్యక్తులను పోలీసులు గుర్తించి స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేస్తుంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ఎదుట ప్రవేశపెడతారు. క్రిమినల్ ప్రోసిజర్ కోడ్ 107, 108, 109, 110సెక్షన్ల కింద బైండోవర్ చేస్తారు. గతంలో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని మండల మేజిస్ట్రేట్ ఎదుట ఒప్పుకున్న తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. చట్టవ్యతిరేక చర్యలు చేపట్టనని బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. బైండోవర్ చేసిన వ్యక్తిపై అనుమానం వస్తే పోలీసులు 24 గంటల వరకు అదుపులో ఉంచుకోవచ్ఛు.
కొడిగెనహళ్లిపై అందరి చూపు
మండలంలోని కొడిగెనహళ్లి మేజర్ పంచాయతీ హిందూపురం పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉంటోంది. పంచాయతీపై పట్టు సాధించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. పంచాయతీ జనాభా 13,017 మంది. ఓటర్లు 8,650 మంది ఉన్నారు. పంచాయతీకి పన్నుల రూపేణా సంవత్సరానికి రూ.5 లక్షలు, ప్రీకాటు బి స్పిన్పింగ్ మిల్లు, కాలువపల్లి గార్మెంట్ పరిశ్రమల ద్వారా మరో రూ.6 లక్షలు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే అధికం. ఎస్సీ వర్గీయులు, దేవాంగ, బోయ కమ్యూనిటీ, రెడ్డి కులస్తులు తర్వాతి స్థానాల్లో ఉంటారు. ఈసారి కొడిగెనహళ్లి సర్పంచి స్థానం ఈసారి ఎస్సీలకు రిజర్వు అయింది.
అభివృద్ధికి పాటుపడే వ్యక్తినే ఎన్నుకుంటాం