శుక్రవారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జూమ్ యాప్లో 'సర్పంచ్ సంవాద్' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రాష్ట్రం నుండి ఎంపికైన ఇద్దరు సర్పంచుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం సర్పంచ్ వంశీకృష్ణ ఒకరు.
ఆయనతో మాట్లాడిన కేంద్ర మంత్రి షెకావత్ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీవద్ద ఉన్న ప్రణాళిక ఏమిటని అడిగారు. దీనిపై సర్పంచ్ బదులిస్తూ.. తాము ఇంటింటా చైతన్యం కల్పించి తడి-పొడి చెత్తను వేరువేరుగా సేకరించి సంపద సృష్టి కేంద్రాన్ని బలోపేతం చేస్తామన్నారు. దీనికి హరిత రాయబారుల సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను సర్పంచ్ మంత్రికి వివరించారు.
సమస్యలను ప్రస్తావించినప్పుడు తమ గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో భాగంగా మురుగు కాలువల నిర్మాణానికి నిధులు కావాలని సర్పంచి అడిగారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎంపిక చేసినందుకు జిల్లా ఉన్నత అధికారులకు ఉరవకొండ ఎంపీడీవో దామోదర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.