Land Grabbing in Anantapur District: అధికార వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అనంతపురం గ్రామీణం కామారుపల్లి పరిధిలోని శోత్రియం భూములను స్వాహా చేయడానికి.. మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ వైసీపీ ఇన్‌ఛార్జి విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితులు తెరలేపారు. దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన 29.54 ఎకరాల భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. ఈ భూమిలో ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్నా.. తమకేమీ పట్టనట్లు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం గ్రామీణ కామారుపల్లి పరిధిలో శోత్రియం భూములు ఉన్నాయి. గతంలో ఈ భూములను బ్రాహ్మణులకు ఇచ్చారు. కాలక్రమేణ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న పేద ప్రజలు వాటిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇందులోనే సాగుకు పనికిరాని గుట్టలు, ఇతర పోరంబోకు భూముల్ని ‘గయాళు’ అని రికార్డుల్లో నమోదు చేశారు. దీని ప్రకారం సర్వే నెంబర్ 28లో 15.42 ఎకరాల భూమి ఉంది.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితుడైన కేవీ రమణకు శోత్రియం భూములపై కన్నుపడింది. విశ్వేశ్వర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సీపీ వీరన్నతో కలిసి భూ ఆక్రమణలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా 28 సర్వే నెంబరును సబ్ డివిజన్‌గా మార్చి 28-1, 28-2గా చేశారు. ఇందులో కేవీ రమణ పేరుతో 14.77 ఎకరాలు, సీపీ వీరన్న పేరిట మరో 14.77 ఎకరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. ఇలా ఇద్దరి పేరుతో మొత్తంగా 29.54 ఎకరాలు నమోదు అయ్యాయి. అంటే 28 సర్వే నెంబరులోని 15.42 ఎకరాలతో పాటు పక్కనున్న భూమిని సైతం కాజేసేందుకు సిద్ధమయ్యారు.
గతంలోనూ ఈ భూమిపై హక్కులు తమవని పొలంలోకి వెళ్లినప్పుడు అక్కడున్న రైతులు గొడవకు దిగి వారిని వెళ్లగొట్టారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అండతో పొలంలో రాళ్లు పాతడానికి వెళ్లారు. ఇది గమనించిన రైతులు రాజకీయంగా ఎదుర్కోలేక జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని రైతుల హెచ్చరిస్తున్నారు. ప్రాణ త్యాగాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
శోత్రియం భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదని.. ఈ నేపథ్యంలోనే తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో పెట్టుబడి పెట్టి బోర్లు వేయించి పంటలు సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే వైసీపీ నాయకులు రాజకీయ అండతో రైతులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
ఇప్పుడా భూమిపై వైసీపీ నేతల కన్ను..