Anantapur District news: అనంతపురం జిల్లా రొళ్ల మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. గత కొన్ని రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన భూతప్ప ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూతప్పల కాలి స్పర్శ కోసం వందల సంఖ్యలో భక్తులు తడిబట్టలతో బోర్లా పడుకొని మొక్కులు తీర్చుకున్నారు.
బూతప్ప కాలి స్పర్శ కోసం భక్తులు తడి బట్టలతో భూతప్పల నడిచే మార్గంలో బోర్లా పడుకున్నారు. ఉర్రాల శబ్దాలకు అనుగుణంగా నడుస్తూ.. భక్తులపై కుడికాలితో తొక్కుకుంటూ భూతప్పలు వెళ్లారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అరటిపండ్లు కలిపిన బొరుగుల రాసులో తలదూర్చి నైవేద్యాన్ని భుజించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.