అనంతపురం జిల్లా హిందూపురంలో కర్ఫ్యూ ఆంక్షలను.. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్, చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలను, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తున్న కర్ఫ్యూను.. జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని.. ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా బయట తిరిగే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉంటూ కొవిడ్ బారిన పడకుండా పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది ఎవరైనా వైరస్ బారిన పడితే.. వారికి జిల్లా కేంద్రంలో 50 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలంతా కర్ఫ్యూ సమయంలో పోలీసులకు సహకరించాలని కోరారు.