కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్లడం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా.. అనంతపురం జిల్లాలో తమ ప్లాంట్ ఏర్పాటుచేసింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి.. కియాను రాష్ట్రానికి తీసుకొచ్చింది. ప్లాంటుకు నీటి వసతి కల్పించడంతో పాటు అనేక రాయితీలు ఇచ్చింది. అయితే కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వ విధానాలతో కియా అసంతృప్తిగా ఉందని.. రాష్ట్రం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ కథనాన్ని ప్రచురించింది. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధనతో పాటు... ఇతర వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్న ఆ సంస్థ.. పొరుగునే ఉన్న తమిళనాడుకు ప్లాంటుకు తరలించే యోచనలో ఉందని పేర్కొంది. రాయిటర్స్ కథనం కలకలం రేపడంతో ఇటు ప్రభుత్వ వర్గాలు , అటు పరిశ్రమ వెంటనే స్పందించాయి. కియా ప్లాంటును తరలించే ఆలోచనేదీ లేదని.. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తున్నామని సంస్థ పీఆర్ఓ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కియా మోటార్స్ ఎక్కడికీ వెళ్లట్లేదని, రాయిటర్స్ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
'కియా ఎక్కడికీ వెళ్లదు.. వదంతులు నమ్మొద్దు'
కొరియా కార్ల తయారీ సంస్థ కియా రాష్ట్రం వదిలి వెళుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. కియా ఏపీలోనే ఉంటుందని స్పష్టం చేసింది. కియా రాష్ట్రం వదిలి వెళుతుందని కొన్ని వార్తా ఏజన్సీల్లో వచ్చిన వార్తలు అవాస్తవాలని కియా పీఆర్ ఏజన్సీ ప్రకటన విడుదల చేసింది.
kia
Last Updated : Feb 6, 2020, 3:41 PM IST