అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు రోజూ మాదిరి తనిఖీలు చేస్తున్నారు. ఐషర్ వాహనాల్లో నిత్యావసరాలు, కూరగాయల బస్తాలు ఉన్నాయి. కొంచెం లోపల పరిశీలించి చూస్తే.. భారీగా కర్ణాటక మద్యం సీసాలు. అసలు విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. రాప్తాడు పరిధిలో వివిధ మండలాల నుంచి వాహనదారులు రైతుల నుంచి కూరగాయల బస్తాలు తీసుకెళ్లి వాటిని కర్ణాటకలో విక్రయిస్తున్నారు. ఆపై అక్కడినుంచి మద్యం ఇలా తెచ్చి స్థానిక వ్యాపారులకు అందించి సొమ్ము చేసుకుంటున్నారు.
దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి సొంతంగా నడుపుతోంది. అందులోనూ మద్యం ధరలను 75 శాతం పెంచింది. ఈ విధానంతో మద్యం బాబులకు చిక్కు వచ్చి పడింది. మద్యానికి పెద్ద మొత్తం ఖర్చు చేయలేక.. సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసి తెస్తున్నారు. మరికొందరు కార్లు, సరకుల వాహనాల్లో రాత్రికిరాత్రి సరకు తెచ్చుకొని గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజూ భారీగా మద్యం పట్టుబడుతుండటం గమనార్హం.
కలిసొస్తున్న సరిహద్ధు..
జిల్లాలో 23 మండలాల పరిధిలో 210 కిలోమీటర్ల మేర కర్ణాటక సరిహద్దు ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక నుంచి మద్యం జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోంది. హిందూపురం, మడకశిర, కదిరి, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లో దాదాపు అన్ని మండలాల్లో కర్ణాటక సరిహద్దు విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల నుంచే జిల్లాలోని ఇతర మండలాల్లోకి కొందరు మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఇదే సమయంలో నాటుసారాను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు.
కావాల్సినంత సహకారం...
కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో పోలీసు, ఎక్సైజ్ శాఖలకు చెందిన కొందరు సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారికి వీరు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇలా సహకరిస్తున్నారని ఇటీవల సోమందేపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ఆ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. నాటు సారా స్థావరాలపై దాడులు జరిగే సమయాని కంటే ముందే సిబ్బంది నుంచి తయారీదారులకు సమాచారం అందడంతో వారు పరారవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.