తెదేపా నాయకులు ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను అడ్డుపెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే అధికారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెదేపాతో కుమ్మక్కైన నిమ్మగడ్డ ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అంతు చూస్తాం..కఠిన చర్యలు తీసుకుంటామనే రీతిలో ఇష్టానుసారంగా మాట్లాడటం ఎన్నికల కమిషనర్‌కు తగదన్నారు.
'నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చార్ దిన్ కా సుల్తాన్. పదవీ విరమణ అనంతరం ఆయన బతుకు బజారు పాలే' అని విమర్శించారు. నిమ్మగడ్డ హెచ్చరికలకు అధికారులు భయపడొద్దని సూచించారు. అక్రమ ఫిర్యాదులు చేసిన వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వమేనన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.