రాష్ట్రం అసమర్థ పాలనలో ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ కక్షతో రాజధాని మార్చేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. పాలన రాజధానిగా విశాఖని ఎన్నుకోవడానికి గల కారణాలను చెప్పే పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు లేరని ధ్వజమెత్తారు. రాయలసీమ వాసులకు రాజధాని దూరం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మాట మార్చడం సరికాదన్నారు.
పరిపాలన చేతకాకే ఆర్థిక వనరులను సమకూర్చుకునే శక్తిసామర్థ్యాలు లేకపోవడంతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిందని ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, జగన్ నుంచి రాష్ట్రానికి పెనుప్రమాదం ఉందన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కాలవ డిమాండ్ చేశారు.