రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం సాధ్యమవుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన అత్యంత దుర్మార్గమైనదని మండిపడ్డారు. రాష్ట్రంలో అందరి మాట ఒక్కటేనని విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రైవేటీకరణ ఆపడం కోసం వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆనాడే సూచించారన్నారు.
తెదేపా ఎంపీలు సైతం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారని గుర్తు చేశారు. గతంలోనూ ప్రతిపక్ష పార్టీల పిలుపుమేరకు 57 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారానే కేంద్రం దిగి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం సృష్టించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రతి రాజకీయ నాయకుడు ఆకాంక్షించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఓ సాధారణ పరిశ్రమలా కాకుండా తెలుగు ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశంగా తీసుకోవాలని సూచించారు. 20 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే పరిశ్రమ ప్రైవేటీకరణను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు.
హెచ్ఎల్సీ ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం విఫలం..