మీడియాతో కాల్వ శ్రీనివాసులు రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే వాతావరణం నెలకొందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టడానికే పని చేస్తోందని విమర్శించారు. తెదేపా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 17, 18, 29 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ తొలగించి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని పలువురు వృద్ధులు, వికలాంగులు ఆయనకు మొరపెట్టుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం, అధికారులు తగు చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.
ప్రతి నిర్ణయం కక్ష పూరితమే
ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతిపక్షాన్ని వేధించడానికేనని కాల్వ ఆరోపించారు. రాజధాని రైతులు మెక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే సీఎం జగన్ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతోన్న గ్రామాల్లో నిర్బంధం విధించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబుకు వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. అది సిట్ కాదని జిట్(జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ టీమ్) అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు మానకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి