అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద ఉన్న తెల్ల కంకర క్వారీకి... స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వం నుంచి అక్రమంగా పర్మిట్లు పొందినట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాయదుర్గంలోని తెదేపా కార్యాలయంలో కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.
2008 సంవత్సరంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామ సమీపంలో కాపు రామచంద్రారెడ్డి 20 హెక్టార్ల క్వారీని లీజుకు తీసుకున్నట్లు కాలవ తెలిపారు. ప్రభుత్వం నుంచి పొందిన పర్మిట్లతో కాపు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్రషర్‌లోని నిల్వ కంటే ఎక్కువ పర్మిట్లు పొందారని... ఇది తీవ్రమైన నేరమని చెప్పారు. కంకర నిల్వ కంటే అధికంగా పన్ను ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కాపు రామచంద్రారెడ్డి రూ. 1.91 కోట్లు చెల్లించాల్సి ఉండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బకాయి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.