తుంగభద్ర జలాశయం నిండటం ప్రజలకెంతో ఉపయోగకరం..:కాలువ - తుంగభద్ర జలాశయాన్ని సందర్శించిన కాలువ శ్రీనివాసులు
తుంగభద్ర జలాశయం నిండుకుండలా పొంగి ప్రవహించటం వలన ప్రజల తాగు సాగు నీటి అవసరాలు తీరుతాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా అవసరాల మేరకు మరో కొత్త రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్ర, కర్ణాటక ప్రజలకు వరప్రదాయనిగా ఉన్న తుంగభద్ర జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. తుంగభద్ర జలాశయం ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండుకుండలా పొంగి ప్రవహిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న ఆంధ్ర, కర్ణాటక ప్రజలకు తుంగభద్ర జలాశయం నిండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జలాశయంలో గత దశాబ్ద కాలంగా భారీ ఎత్తున నీరు చేరుకోవటంతో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు తాగు సాగునీటి సౌకర్యం కలుగటంతోపాటు కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, కొప్పల జిల్లాలకు నీరందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ప్రజల అవసరాల కోసం బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వద్ద కొత్త రిజర్వాయర్ ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. ఎస్సీ కె.వి.రమణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి వరద నీరు నది గుండా కృష్ణానదిలోకి కలుస్తుయని మరో వారం పాటు డ్యాంకు ఇన్ ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో టీబీ డ్యాము వరద నీరు నిండటంతో ఖరీఫ్ పంటలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు హెచ్ఎల్ సీ, ఎల్ఎల్ సీ ద్వారా సక్రమంగా నీరు అందించడానికి చర్యలు చేపడతామని ఎస్సీ వివరించారు.