అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయదుర్గం మండలం బి.ఎన్.హళ్లి గ్రామంలో గతేడాది ఆత్మహత్య చేసుకున్న మూడు కుటుంబాలను స్థానిక తెదేపా నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. తమ వారిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధిత కుటుంబాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే చేసిందని వాటితో...అప్పులు కూడా తీరలేదని వాపోయారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందించాలని కాలువ డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు. ఇప్పటివరకు 85 మంది అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.