రాష్ట్రంలో గత వంద రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వానికి హైందవ సంస్కృతీ, సాంప్రదాయలను పరిరక్షించే ఉద్దేశమే లేనట్టుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో హిందువులు ఆవేదనతో ఉంటే... మంత్రులు అగ్గికి ఆజ్యం పోసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. రథాలను కాల్చేస్తున్నా.. ఏమవుతుందన్న అహంకారంతో మంత్రులు మాట్లాడుతున్నారని కాలవ మండిపడ్డారు. ఇలాంటి పరిణామాల మధ్య ముఖ్యమంత్రి జగన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ముందు డిక్లరేషన్‌పై సంతకం చేసి.. అందరి మనోభావాలు గౌరవిస్తామని నిరూపించుకోవాలని హితవు పలికారు. డిక్లరేషన్‌పై సంతకం చేయించుకోవాల్సిన బాధ్యత తితిదే ఈవోపై ఉందన్నారు. అందుకే దీనిపై తాము తితిదేకు లేఖ రాస్తున్నట్లు శ్రీనివాసులు వివరించారు.
తిరుమలలో డిక్లరేషన్‌పై సీఎం జగన్ సంతకం చేయాల్సిందేనని మాజీమంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. ఎవరైనా సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మౌనానికి కారణమేంటని ప్రశ్నించారు. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్న దేవినేని ఉమ... భక్తుల మనోభావాలను కించపరిచేలా మంత్రులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.