"అనంతపురం రైతులకు అన్యాయం చేసిన సీఎం జగన్.. జిల్లాకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. జిల్లా రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.930 కోట్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రైతులకు చేసిన మోసాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"రాయదుర్గం పట్టణంలో జూలై 8న ప్రభుత్వం నిర్వహిస్తున్నది రైతు దినోత్సవం కాదు.. రైతు విద్రోహ దినోత్సవం. రైతులకు హక్కుగా రావాల్సిన రాయితీలను నిలిపివేశారు. ఈ క్రాప్ బుకింగ్‌లో జరిగిన అవకతవకలతో లక్షలాది మంది రైతులు ఇన్సూరెన్స్‌కు దూరమయ్యారు. అనంతపురం జిల్లా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీపీ ప్రాజెక్ట్, ఉంతకల్లు రిజర్వాయర్ పనులకు నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. సాగునీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసి రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం సరికాదు" - కాలవశ్రీనివాసులు, తెదేపా పొలిట్ బ్యూర్ సభ్యుడు