అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అప్రజాస్వామికంగా పోలీసులు అరెస్టు చేశారంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఓ ప్రకటనలో ఖండించారు. ప్రతిష్ఠాత్మక కియా పరిశ్రమను ఓ పార్టీ నాయకుడు పరిశీలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అరెస్టు చేసేంత తప్పేమి చేశారని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక రావణ కాష్టంలో ఉన్నారా అనే పరిస్థితుల్ని ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించారు. పాలనను పక్కన ఎట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ తప్పు చేయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అన్యాయంగా 42 రోజుల పాటు జైలులో ఉంచి మనోవ్యధకు గురి చేశారని దుయ్యబట్టారు. నేరస్థుడికి అధికారం అప్పగిస్తే.. రాష్ట్రం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్లారా చూస్తున్నారన్నారు. విచ్ఛలవిడిగా 144 సెక్షన్‌ను వాడుతూ ప్రజాస్వామ్య రాజ్యంలో నియంతృత్వ పోకడలకు పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.