అనంతపురం జిల్లా కదిరిలో వైకాపాలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. కదిరి పట్టణ అధ్యక్షుడు బాహావుద్దీన్ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వారిని విస్మరించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే పీఏపై తన సోదరుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేశారని.. ఈ విషయంలో తమ్ముడితో పాటు తనపై కూడా కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. ఆ పోస్టును తాను షేర్, లైక్ చేయలేదని.. అలాంటప్పుడు తనపై పోలీసులు ఎలా కేసు పెడతారన్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న తనపై ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. త్వరలోనే ఈ విషయంపై అదిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.