సునీతకి పెళ్లై మూడు నెలలైంది. భర్త బెంగళూరులోని పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఓ కారు యాక్సిడెంటులో అతను చనిపోయిన తర్వాత ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు పెద్దవాళ్లు. వాళ్లపై ఆధారపడలేని పరిస్థితి. ఆ సమయంలో రాయదుర్గంలోని టెక్స్టైల్ పార్కు ఆమెకి పుట్టింటిలా ఆశ్రయమిచ్చింది. అమ్మలా అక్కున చేర్చుకుంది.
నాగమణెమ్మకి ఐదుగురు చెల్లెళ్లు. ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా ఏ అండా లేని ఆమె దుస్తుల పరిశ్రమలో చేరి కుమారుడిని చదివించుకుంటూ చెల్లెళ్లకు పెళ్లిళ్లూ చేసింది.
రాయదుర్గానికి చెందిన వాల్మీకి లక్ష్మి కొన్నేళ్లక్రితం కటింగ్ మాస్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఓ దుస్తుల కంపెనీకి యజమాని. ఆమె దగ్గర ఇరవైమంది మహిళలు పనిచేస్తున్నారు. ఏడాదికి రూ.15 లక్షల రూపాయల వ్యాపారం చేస్తోంది.
సునీత, లక్ష్మి, నాగమణెమ్మల మాదిరిగానే రాయదుర్గం, అనంతపురం ప్రాంతాల్లోని పదివేలమందికిపైగా మహిళలకు జీన్స్ దుస్తుల తయారీ ఓ నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఉండే వర్షాభావ పరిస్థితులు, కరవు కాటకాలు వారిని వ్యవసాయేతర ఉపాధివైపు మొగ్గుచూపేలా చేశాయి. అదే సమయంలో ఇక్కడి టెక్స్‌టైల్‌పార్క్, ఇతర దుస్తుల పరిశ్రమలు వలసలని అడ్డుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. దీనికి ప్రభుత్వ సహకారం కూడా తోడవ్వడంతో మహిళలు జీన్స్ తయారీలో రాణించడం మొదలుపెట్టారు. ఐఎస్‌డీఎస్, టాటా ట్రస్ట్, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన శిక్షణను అందిపుచ్చుకుని స్వావలంబన పొందుతున్నారు.