'జీన్స్' ఉత్పత్తి ప్రారంభం... రాయదుర్గంలో మళ్లీ సందడి వాతావరణం! అనంతపురం జిల్లా రాయదుర్గం.. జీన్స్ ప్యాంట్ల పరిశ్రమకు ప్రసిద్ధి. దాదాపు రెండు వేల వరకూ జీన్స్ ప్యాంట్లు తయారు చేసే చిన్న, పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో పదివేల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
నాణ్యమైన జీన్స్ దుస్తుల ఉత్పత్తులను అందించే ఈ పరిశ్రమకు లాక్ డౌన్ తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. 6 నెలలుగా పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్రం అన్లాక్ మార్గదర్శకాలకు తోడు.. ప్రస్తుతం దసరా సీజన్ కావటంతో పరిశ్రమ తలుపులు తెరుచుకొని, నెమ్మదిగా ఉత్పత్తి ప్రారంభించారు.
ఎంతో మందికి ఉపాధి
రాయదుర్గం జీన్స్ పరిశ్రమ ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి కల్పిస్తుండగా, పరోక్షంగా మరో 20వేల పైచిలుకు మంది జీవనోపాధి పొందుతున్నారు. రాయదుర్గం జీన్స్ పరిశ్రమల్లో కొందరు యజమానులు, చైనా నుంచి ముడి సరుకు దిగుమతి చేసుకుంటుండగా, మరికొందరు అహ్మదాబాద్ హోల్ సేల్ డీలర్ల నుంచి తెచ్చుకునేవారు. చైనా నుంచి దిగుమతి అయ్యే జీన్స్ వస్త్రం, ప్యాంట్ల జిప్పులు, గుండీలు, దారం వంటి ముడి సరుకుల సరఫరా నిలిచిపోయింది.
చైనాలోనూ మళ్లీ పరిశ్రమలు తెరుచుకోవటంతో కొంతమేర జీన్స్ ప్యాంట్లకు ముడి సరుకు దిగుమతి మొదలైంది. ముడి సరుకు తెచ్చుకుంటున్న యజమానులు, పండుగ సీజన్‌లకు జీన్స్ ప్యాంట్ల ఉత్పత్తి ప్రారంభించారు. కరోనా కారణంగా నష్టపోయిన జీన్స్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చేయూతనిస్తేనే పూర్వ వైభవం
రాయదుర్గం వీధుల్లో మళ్లీ సందడి మొదలుకావటంతో పరిశ్రమలో పనిచేసే కూలీల్లోనూ మళ్లీ సంతోషం కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన తమకు ఇప్పుడిప్పుడే పని లభిస్తోందని చెబుతున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాయదుర్గం జీన్స్ పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహమందిస్తే పూర్వ వైభవం వస్తుందని యజమానులు చెబుతున్నారు.