ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి - ap municipal elections latest news

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిచింది. పురపాలక ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైకాపా విజయబావుటా ఎగురవేస్తే తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం పైచేయి సాధించింది. పారిశుద్ధ్య నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణకు చిరునామాగా నిలిచిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాడిపత్రి ప్రజలు పట్టం కట్టారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ పట్టణ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. అధికార, విపక్ష నేతలు ప్రకటించారు.

Jc prabhaker reddy elected as tadipathi municipal chairman
తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

By

Published : Mar 19, 2021, 8:14 AM IST

తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పురపాలక ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం ఉదయం తాడిపత్రిలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించారు. వైకాపా తరఫున 2వ వార్డు నుంచి గెలుపొందిన ఫయాజ్‌ బాషా, తెదేపా నుంచి 24వ వార్డు కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌ పదవికి పోటీపడ్డారు. ఓటింగ్‌ నిర్వహించగా.. ఫయాజ్‌ బాషాకు ఎక్స్‌అఫీషియో సభ్యులు (ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే పెద్దారెడ్డి) మద్దతు కలిపి 18 ఓట్లు వచ్చాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలపడంతో 20 ఓట్లు వచ్చాయి. దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి జి.ఆర్‌.మధుసూదన్‌ ప్రకటించారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి వైకాపా నుంచి పి.రూప, తెదేపా నుంచి పి.సరస్వతి పోటీపడగా రెండు ఓట్ల తేడాతో సరస్వతి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి 1987-1992, 2000-2005 మధ్య కాలంలో మున్సిపల్‌ ఛైర్మన్‌గా పని చేశారు. తాజాగా మూడోసారి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

అభివృద్ధికి కలిసి పనిచేస్తా: జేసీ ప్రభాకర్‌రెడ్డి

‘తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పని చేస్తా. అవసరమైతే నిధుల కోసం సీఎం జగన్‌ను కలుస్తా. మా మధ్య వైరుధ్యం ఉండొచ్చు కానీ ఆయన రాష్ట్రానికి సీఎం. ఈ విషయంలో జగన్‌ సహకరిస్తారని నమ్ముతున్నా. మున్సిపల్‌ ఎన్నిక ప్రశాంతంగా జరగడంలో ఆయన సహకారం ఉంది. లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అంత సులభంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యేవాణ్ని కాదు.’- జేసీ ప్రభాకర్‌రెడ్డి

జేసీకి సహకరిస్తా: పెద్దారెడ్డి, ఎమ్మెల్యే

‘మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి అభివృద్ధి విషయంలో నన్ను ఏదైనా అడిగితే తప్పకుండా సహకరిస్తా. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లాం. మేమే గెలవాలనుకుంటే అధికారులను అడ్డుపెట్టుకుని 5 నిమిషాల్లో చేయగలిగేవాళ్లం. కానీ మా ఉద్దేశం అది కాదు. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం.'- పెద్దారెడ్డి, ఎమ్మెల్యే

ఇదీ చదవండి: కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీళ్లే..

ABOUT THE AUTHOR

...view details