JC Prabhakar Reddy Arrest : ఓ వైపు ఇసుక తవ్వకాలు.. ఇంకోవైపు టీడీపీ శ్రేణుల నిరసన మధ్య పోలీసులు హైడ్రామా నడిపారు. మీడియా ప్రతినిధులతో కలిసి ఇసుక తవ్వకాల వద్దకు వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని.. సుమారు 4గంటల పాటు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. తాను మందులు వేసుకోవాలని జేసీ ప్రాథేయపడినా పట్టించుకోలేదు. నిరసనలో పాల్గొన్న మరో 18 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను, నాలుగు వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.
భారీగా గోతులు పెట్టి అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోరా..? అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను నిలదీశారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో రెండు వారాల క్రితం అశ్వర్థం ఆలయానికి వచ్చిన ఇద్దరు కర్ణాటక భక్తులు పెన్నానదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. దీనిపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అక్రమంగా ఇసుక తవ్వతున్నారంటూ మీడియా ప్రతినిధితులతో కలిసి పెద్దపప్పూరు వద్ద పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో గోతులు పెట్టి భారీ యంత్రాలతో ఇసుక తోడుతున్న తీరును మీడియాకు చూపించారు.
ఇసుక తవ్వకానికి అనుమతి లేకపోయినా, వందలాది టిప్పర్లు రోజూ ఇసుక తవ్వి తరలిస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక రీచ్ అనుమతులు చూపాలని లేకపోతే బాధ్యులపై కేసులు పెట్టాలంటూ పెద్దపప్పూరు ప్రధాన రహదారిపై బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. టీడీపీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కాగా, అనుమతి లేకుండా పెన్నానదిలోకి రావటమే కాకుండా, ఆందోళన చేస్తారా..? అంటూ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మైనింగ్ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని జేసీ పట్టుబట్టటంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు.