సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రిలో జేసీ మీడియాతో మాట్లాడారు.
JC Prabhakarreddy: సినీ పరిశ్రమపై కక్ష సాధించి ఏం చేస్తారు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కక్షసాధింపు చర్య వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పై కక్ష కట్టారని ఆరోపించారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి సైతం మాట్లాడినా స్పందించకపోవడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్‌ని ఏమి చేయలేక సినిమా వాళ్ళపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే విధంగా ప్రోత్సాహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం ఉండదు. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతేకానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారు. లా అండ్ ఆర్డర్‌ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా ప్రివ్యూ కార్యక్రమంలో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్ హాజరవడంతో పవన్ కల్యాణ్‌కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్ కల్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కవగానే ఉంటుంది. అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు, సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి:BJP Veerraju on TTD: హిందుత్వం అంటే వ్యాపారం కాదు: సోము వీర్రాజు