సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారన్న కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి వద్ద హాజరు పరిచారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.... కొన్ని గంటల తరువాత అనంతపురంలోని వన్‌టౌన్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఏఎస్పీ రామాంజినేయులు ఆధ్వర్యంలో ఇద్దర్నీ సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రెండున్నర గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం మళ్లీ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి అరవింద్ నగర్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఎదుట ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిలను హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వీరిని రెడ్డిపల్లి వద్ద ఉన్న జిల్లా జైలుకు తరలించారు. వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఆదివారం వచ్చే అవకాశం ఉందని ఏఎస్పీ రామాంజినేయులు తెలిపారు.
లైవ్ అప్డేట్స్: జేసీ ప్రభాకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
19:02 June 13
జేసీ ప్రభాకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
17:29 June 13
న్యాయమూర్తి ఎదుట హాజరు
పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
15:47 June 13
ప్రభుత్వాస్పత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అక్కడ విచారణ తర్వాత భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో నో ప్రాబ్లం అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
11:19 June 13
అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
అనంతపురం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి తరలించారు. పోలీసుస్టేషన్ వద్ద తెదేపా శ్రేణులు, జేసీ సోదరుల అనుచరుల బైఠాయించారు. నినాదాలు చేస్తున్న తెదేపా శ్రేణులు, జేసీ సోదరుల అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.
11:17 June 13
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు
తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడి అస్మిత్ రెడ్డిని కూడా శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరు బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు.నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ….154 లారీలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని.... కొంతకాలంగా ఆర్టీఏ అధికారులు ఆరోపించారు. జేసీ కుటుంబసభ్యులపై అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. తాడిపత్రిలో 17.... కర్నూలు జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలతో అనంతపురంలో 51 లారీలను గతంలో పోలీసులు సీజ్ చేశారు.