అనంతపురం జిల్లా తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ అధికారుల తీరుపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని వచ్చిన ఆయన... ఉన్నతాధికారులు లేకపోవటంతో సిబ్బందితో మాట్లాడి వెనుదిరిగారు. కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన... తాను వస్తానని తెలిసి గనుల శాఖ ఏడీ కార్యాలయం నుంచి పారిపోయారని వ్యాఖ్యానించారు.
అధికారులు చేస్తున్నదానికి రెట్టింపు సన్మానం చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి - మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిందని... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. తన గనుల్లోకి అధికారులు 8 జీపులు వేసుకుని రావటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
'పెద్దపప్పురు మండలం ముచ్చుకోట కొండల్లో ఉన్న గనులే మాకు జీవనాధారం. వాటిని మూసివేసి మా కడుపు కొట్టకండి. మా. గనుల్లోకి అధికారులు 8 జీపులు వేసుకొని వచ్చి తనిఖీ చేయటంలో ఆంతర్యం ఏమిటి?. మా గనుల్లో నక్సలైట్లు ఏమైనా ఉన్నారా?. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా మా కుటుంబాన్ని వేధిస్తోంది. ఇది వరకే నా తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రస్తుతం నన్ను టార్గెట్ చేస్తున్నారు. నియంత పాలన ఎంతకాలం ఉంటుందో చూస్తా. అధికారులు నాకు చేసిన సన్మానానికి రెట్టింపు సన్మానం చేస్తా' అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయకండని అధికారులను ఉద్దేశించి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే కాలం మారుతుంది జాగ్రత్త అని హెచ్చరించారు. అధికారులు ఎవరూ లేరు కాబట్టి సోమవారం తన కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.